దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: గడికోట
సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌పై రగడ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీటీడీలో ప్రతి ఒక్కరికి స్వామి దర్శనం ముఖ్యమని.. ఆ దిశగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తిరుమలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం తగదని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. తన పాలనాకాలంలో చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు, పవన్ చెప్పినట్లయితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు.